చెన్నకేశవస్వామి ఆలయం, మార్కాపురం
చెన్నకేశవస్వామి ఆలయం, మార్కాపురం
స్థలపురాణము
శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి దేవాలయం చుట్టూ పెద్ద ప్రాకారం నిర్మితమైంది. మార్కండేయ మహర్షి తపస్సును కేశి అనే రాక్షసుడు భగ్నం చేయకుండా మహావిష్ణువు రాక్షసుని సంహరిస్తాడు. గర్భాలయాన్ని మారిక అనే యాదవస్త్రీ నిర్మించింది. స్వామివారు మారికను అనుగ్రహించారు. ఆమె పేరుతో వాడుక లోకి వచ్చిన మారికాపురం కాలక్రమేణ మార్కాపురంగా వాసికెక్కింది. ధాన్యకటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగివస్తూ ఈ ఆలయంలో బసచేశాడు. శ్రీకృష్ణదేవరాయలు మధ్యరంగ మండపాన్ని నిర్మించాడు ఆలయానికి ముందున్న రాతిస్తంభాన్ని విజయసూచికగా ఆయనే నిలిపాడు.
చరిత్రలో మార్కాపురం
12 వ శతాబ్దంలో పల్నాటి రాజు మలిదేవుడు గురజాలలో జరిగిన కోడి పందేలలో ఓడి పోయాడు. అపుడు రాజు తన మంత్రి బ్రహ్మనాయుడితో కలిసి చెన్న కేశవుణ్ణి పూజించాడు. ఈ విషయాన్ని శ్రీ నాథుడు తన గ్రంథం పల్నాటి వీర చరిత్రలో ప్రస్తావించాడు. 1513 లో శ్రీకృష్ణ దేవరాయలు స్వామి వారిని దర్శించుకొని, తన సామంత రాజు తిమ్మ రాజయ్యను పిలిపించి స్వామి వారికి అంతరాళం, మహాద్వారం, గర్భగుడి పై విమాన గోపురం, రాజ్య లక్ష్మి అమ్మవారికి ఆలయాన్ని పూర్తి చేయమని ఆదేశించాడు. ఆ తర్వాత కాలంలో అచ్యుత దేవరాయలు ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహ స్వామి, వేణు గోపాల స్వామి, రంగనాయక స్వామి, గోదాదేవి, రామానుజుల వంటి మరికొన్ని ఆలయాలను నిర్మించారు. గాలి గోపురం వివిధ దశలలో పూర్తి గావించ బడింది. 1929 లో అప్పటి తాలూకా గుమస్తా పోనంగి లింగ రాజు రెండు అంతస్తులను నిర్మించాడు. మిగతా ఏడు అంతస్తులను 1936 లో నాటి మేజిస్ట్రేట్ రాయసం సంహోగేశ్వరావు భక్తుల సహకారంతో పూర్తి చేశాడు. పురాతన కాలంనుండి ఈ పవిత్రక్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సోమప్రభాపురం అని పిలిచేవారు.
క్షేత్ర విశిష్టత
స్వామి వారి మూల విరాట్టు చుట్టూ మకర తోరణం ఉంది. ఈ తోరణం పై దశావతారాలున్నాయి. సాధారణంగా స్వామివారి కుడి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఈ స్వామి వారి ఎడమ చేతిలో సుదర్శన చక్రం ఉంది. మూల విరాట్టు ప్రక్కనే మార్కండేయ మహర్షి, మారిక, మారకయ్యల విగ్రహాలు కూడా ఉన్నాయి. అస్థాన మండపంలో ఉన్న స్థంభాలన్నీ ఏక శిలా స్థంభాలే. ఈ ఆలయంలో ఉన్న చూరు మరో ఆకర్షణ. అన్ని విధాల ఒకే విధంగా ఉన్న రెండు స్థంభాలను అన్నదమ్ముల స్థంభాలంటారు.
ఎలా వెళ్లాలి ?
ఒంగోలు నుండి మార్కాపురానికి సుమారు 90 కిలోమీటర్లు. ఇది రోడ్డు మార్గం. విజయవాడ కర్నూలు రైలు మార్గంలో మార్కాపురం స్టేషను ఉంది. అలా చేరుకోవచ్చు.
No comments: