తిరుపతి(Tirupati)
తిరుపతి
తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో
ఉన్న ఏకైక నగరము మరియు ఆంధ్ర ప్రదేశ్లో 4 వ అతిపెద్ధ నగరం .తిరుపతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరుపతి నగరానికి విమాన, రైలు, రహదారి సౌకర్యాలు ఉన్నాయి. ఈ నగరం
విజయవాడకు 349 కి.మీ, హైదరాబాదుకు 550 కి.మీ, బెంగళూరుకు 256 కి.మీ., చెన్నైకు 140 కి.మీ దూరంలో ఉంది.
చరిత్ర
రామానుజాచార్యులు కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటుచేయడంతో తిరుమల చరిత్రకు బీజం పడింది. తన శిష్యుడైన యాదవరాజును రామానుజులు ప్రోత్సహించి అప్పటికే ఉన్న చెరువు పక్కన ఆలయ నిర్మాణం ప్రారంభించేలా చేశారు. యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తయ్యాకా క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట రామానుజపురం అని నామకరణం చేశారు. రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలు నిర్మించారు. శ్రీశైలపూర్ణుడు, అనంతాచార్యులు వంటి భక్తులకు నివాసాలు ఏర్పాటుచేశారు. దేవాలయానికి తూర్పున ధాన్యాగారం, వాయువ్యదిశలో అంగడి వీధి నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాదివేశారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు, శాసనాధారాలు ఉన్నాయి. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు తిరుపతి వేంకటేశ్వరస్వామిని చాలా మార్లు దర్శించుకొని కానుకలు సమర్పించాడు. చంద్రగిరి కోట నుంచి తిరుమల గిరుల పైకి చేరుకోవటానికి అతి సమీప కాలి మార్గమైన శ్రీ వారి మెట్టు ద్వారా శ్రీ కృష్ణదేవ రాయలు తరచూ స్వామి దర్శనమునకు డోలీపై వెళ్ళేవాడు. 9వ శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవులు, ఆ తరువాతి శతాబ్దపు తంజావూరు చోళులు, మదురైని పరిపాలించిన పాండ్యులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు, సామంతులు ఈ వేంకటేశ్వరస్వామి భక్తులై కొలిచారు. ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయనిర్వహణకు, సేవలకు దానధర్మాలు చేశారు. విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది. శ్రీ కృష్ణదేవరాయలు తన ఇద్దరు భార్యల విగ్రహాలను, తన విగ్రహాన్ని, ఆలయ మండపం పై ప్రతిష్ఠింపజేశాడు. ప్రధాన ఆలయంలో వేంకటపతి రాయల విగ్రహం కూడా ఉంది. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత, దేశం నలుమూలల ఉన్న చాలామంది చిన్న నాయకులు, ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బహూకరించడం కొనసాగించారు. మరాఠీ సేనాని, రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్య పూజా నిర్వహణకై శాశ్వత దాన పథకాన్ని స్థాపించాడు. ఈయన వేంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతాన్ని, విలువైన వజ్రవైఢూర్యాలను బహూకరించాడు. ఆ మరకతం ఇప్పటికీ రాఘోజీ పేరుతో ఉన్న ఒక పెట్టెలో భద్రంగా ఉంది. ఆ తరువాతి కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో మైసూరు మరియు గద్వాల పాలకులు చెప్పుకోదగినవారు. హిందూ సామ్రాజ్యాల తరువాత, పాలన కర్ణాటక ముస్లిం పాలకుల చేతిలోకి, ఆ తరువాత బ్రిటీషు వారికి వెళ్లింది. తిరుపతి గుడి కూడా వారి పర్యవేక్షణ కిందికి వచ్చింది. అయితే చరిత్రపరంగా ఆలయం మొదట బౌద్ధ / జైన దేవాలయమనిbవాదించే చరిత్రకారులు లేకపోలేదు.
తిరుపతి దేవాలయములు
·
గోవిందరాజ స్వామి దేవాలయం: తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత రాజగోపురంతో తిరుపతికే ప్రత్యేక శోభను కలుగజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం ఉంది. క్రీ.శ. 1130లో రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని భక్తజనాంకితం చేశారు. ఈ రాజగోపురాన్ని 1624లో స్వామిభక్తుడు మట్లి అనంతరాజు నిర్మించారు. గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అనేకానేక ఆలయాలు ఉన్నాయి. గతంలో ఇది శ్రీకృష్ణ ఆలయం అయినా, నాటి మూలవిరాట్ అయిన శ్రీకృష్ణుని మీద తురుష్కుల విధ్వంస చర్యలవల్ల ఆ విగ్రహం పూజార్హత కోల్పోవటంతో, ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమయిందని అంటారు. తిరుమలలోని వేంకటేశ్వరునిపెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొన్ని పూజలూ పునస్కారాలూ తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారి తలకింద ఒక పెద్ద కుంచం ఉంటుంది. వేంకటేశ్వరుడు తన వివాహ సమయంలో, కుబేరుడి వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో, సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమయిన గోవిందరాజస్వామి, ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసిసొలసి, రవ్వంత విశ్రమిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహం.
·
కోదండ రామాలయం: ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే, సీతమ్మతల్లి రాములవారికి కుడివైపున ఉండటం! ఇది వైఖానసశాస్త్రసంప్రదాయం. భద్రాచల రాముడి విగ్రహాన్ని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకొంటే, అక్కడ సీతమ్మతల్లి, రాములవారి ఎడమవైపు తొడమీద కూర్చున్నట్లున్న దృశ్యం గుర్తొస్తుంది!
·
కపిలతీర్థం: కపిల మహాముని యొక్క తపోఫలితానికి మెచ్చి ఈశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రం. టిటిడి యొక్క పర్యవేక్షణలో ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడా చెప్పుకోదగినది. తిరుమల గిరులకు ఆనుకొని ఉన్న ఈ ఆలయం మరియు ఇక్కడి జలపాతాలు మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. తిరుపతిలో దర్శించదగిన ఆలయాలలో ఇది చెప్పుకోతగినది.
·
వరదరాజ స్వామి దేవాలయం: ఇది కపిల తీర్థం రోడ్డు లేదా కే టీ రోడ్డులో ఉంది. 1990 ల ప్రాంతంలో ఈ గుడిని జీర్ణోధరణ గావించారు. ఇక్కడ సన్నిధిలో శ్రీ నృసింహస్వామి మరియు శ్రీ సుదర్శనచక్రతాళ్వార్లు ఏకశిలలో పూజలందుకుంటున్నారు. శ్రీ సుదర్శనచక్రతాళ్వార్లు గోవిందరాజస్వామి దేవాలయం సన్నిధిలో కూడా పూజలందుకుంటున్నారు.
·
జీవకోన: జీవకోన కపిల తీర్తానికి కొంచెం దూరంలో వున్న తిరుపతి రూరల్ మండలం. ఇక్కడ ప్రకృతి సహజసిద్దంగ ఏర్పడ్డ శివలింగం చూడవచ్చు. కొండపక్కన అటవీ ప్రాంతంలో జాలువారేజలపాతం మద్య ఈశ్వరుని దర్శనం అద్భుతం.
·
ఇస్కాన్ దేవాలయం: ప్రేమకు ప్రతిరూపాలైన రాధాకృష్ణుల (అష్టసఖి సమేత) దేవాలయం ఇది. భక్తుల నాట్యవిన్యాసాలతో నిత్యం కలకలాడుతు ఉంటుంది. భక్తులు చేసే నాట్యమునకు భూమి స్పందించినట్లు ఉంటుంది.
తిరుపతి చుట్టుపక్కల దేవాలయలు
·
శ్రీనివాస మంగాపురం: తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీనివాస మంగాపురం. ఇది ఆ శ్రీనివాసుడు విశ్రమించిన చోటు. నారాయణవనంలో పద్మావతీదేవిని వివాహమాడిన వేంకటేశ్వరుడు, తిరుమలకు వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు చెప్తారు. ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరుడు నిలువెత్తుగా, బహు సుందరమూర్తిగా దర్శనం ఇస్తాడు.
·
అలివేలు మంగాపురం లేదా తిరుచానూరు: తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకొన్న భక్తులు- కొండ దిగి ముందుగా చేయాల్సిన పని తిరుచానూర్ (దీన్నే అలివేలుమంగాపురం అంటారు) లోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకోవటమే! అయితే స్వామివారికన్నాముందే, అమ్మవారిని దర్శించాలని చాలామంది అంటారు. తిరుచానూర్, తిరుపతికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్తీకమాసంలోతిరుచానూర్ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలూ బహువైభవంగా జరుగుతాయి. స్వామికిలాగే, అమ్మవారికీ నిత్య కళ్యాణమే.
·
ముక్కోటి: ఈ అలయము తిరుపతి.... చంద్రగిరి రహదారిలో తిరుపతికి నాలుగు కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. ప్రసిద్ధి గాంచినది, మరియు కచ్చితంగా చూడవలసిన మహిమాన్విత శివాలయము. చంద్రగిరి మండలంలో వెలసిన పవిత్ర స్థలం, ఈ శివాలయం.
·
కాణిపాకం: తిరుపతికి సుమారు 70 కిలోమీటర్లు దూరంలో ఉంది.
·
శ్రీకాళహస్తి: తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో ఉంది.
·
యోగిమల్లవరం: ఈ గ్రామం తిరుపతికి 4 కి.మీ. దూరంలో వున్న అతి పురాతన గ్రామం. ఇక్కడ అతి పురాతన శివుని దేవాలయం వుంది, మూల విరాట్టు పరాశరేశ్వర స్వామి.
·
గుడిమల్లం: ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు.గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.
·
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట: తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంటలో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది.
·
శ్రీ వేదనారాయణస్వామి ఆలయం, నాగలాపురం: తిరుపతి నుండి 70 కి.మీ. దూరంలో ఉంది.
·
బోయకొండ గంగమ్మ: తిరుపతికి సుమారు 120 కిలోమీటర్లు దూరంలో ఉంది.
·
అష్టలక్ష్మీ ఆలయం: తిరుపతికి సుమారు 75 కిలోమీటర్లు దూరంలో ఉన్న వేపంజెరి అను గ్రామంలో ఉంది.
·
[శ్రీ లలితా పీఠం , వశిష్ట ఆశ్రమం , శ్రీనివాస మంగాపురం]: తిరుపతికి 10 కి.మీ దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం లో శ్రీ లలితా పీఠం నెలకొల్పబడినది.ద్వాదశ జ్యోతిర్లింగాలు , అష్టాదశ శక్తి పీఠాలు ఇచ్చటనే దర్శించుకునే అద్భుత అవకాశం ఇక్కడ కలుగుతుంది.
·
అర్ధగిరి శ్రీ వీరాంజనేయ దేవాలయం: తిరుపతికి సుమారు 85 కిలోమీటర్లు దూరంలో ఉంది.
·
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం, నారాయణవనం: తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో ఉంది.
·
శ్రీ కైలాసనాధస్వామి ఆలయం, కైలాసకోన, నారాయణవనం: తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో ఉంది.
·
శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం, కార్వేటినగరం: తిరుపతికి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది.
తిరుపతి చుట్టుపక్కల చూడదగిన విశేషాలు
అలిపిరి
అలపిరి దగ్గరున్న మెట్ల దారిలో వున్న తల తాకుడు గుండు: -దీన్నె తలయేరు గుండు అని కూడా అంటారు. - గతంలో అంటరాని వారు కొండ పైకి వెళ్ళే వారు కాదు. వారు ఈ గుండుకు తమ తలను తాకించి ఇక్కడి నుండే వారు తిరిగి వెనక్కి వెళ్ళే వారు. ఏడు కొండలపై తమ పాదాలను సైతం ఉంచ రాదు అని అనుకునె వారు. అందు చేత ఈగుండుకు రంద్రాలున్నాయి. ఇంకో కథనం ప్రకారం ఈ తలయేరు గుండు నుండి మెట్ల దారి అతి కష్టం వుంటుండి. దీనిని మోకాళ్ల మెట్ల దారి అంటారు. తమ మోకాళ్ల నెప్పులు తగ్గాలంటే ఈ గుండుకు తమ మోకాళ్లను తాకించి నడిస్తే మోకాళ్లు నెప్పులు వుండవని భక్తుల నమ్మిక. కారణం ఏదైతేనేమి తల తాకించినా, మోకాలు తాకించినా ఆ గుండుకు అనేక గుంటలు పడి ఉన్నాయి. గత కాలానికి దర్పణంగా ఈగుండును ఇప్పటికి చూడవచ్చు
ఇక్కడే శ్రీ వారి పాదాల మండపం ఉంది. ఇక్కడ శ్రీవారి పాదుకలు, వెండివి ఉన్నాయి. వాటిని భక్తులు కొంత రుసుం చెల్లించి తమ నెత్తిన పెట్టుకొని ఇస్తుంటారు. అదే విధంగా ఇక్కడ శ్రీక్రిష్టదేవ రాయలచే నిర్మితం అయిన పెద్ద గోపురం ఉంది.
·
శ్రీవారి మెట్టు: తిరుమల అతిత్వరగా నడక ద్వారా వెళ్ళు దారి.
·
చంద్రగిరి కోట: తిరుపతికీ చంద్రగిరి పాలకులకూ అవినాభావ సంబంధం ఉండేది. తిరుమల ఆలయంలో నైవేద్య ఘంటికా రావాన్ని విన్న తర్వాతనే చంద్రగిరి పాలకులు ఏ ఆహారాన్ని అయినా ముట్టేవారట. అలనాటి చంద్రగిరి వైభవాన్ని కనులారా చూడాలంటే... అక్కడ ప్రతిరోజూ జరిగే లైట్ అండ్ సౌండ్ షోకు వెళ్ళాల్సిందే.
·
హార్సలి హిల్స్: తిరుపతికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో హార్స్లీహిల్స్ ఉంది. అంత ఎత్తున విడిదిగృహాన్ని కట్టించుకున్న అప్పటి కడపజిల్లా కలెక్టర్ డబ్ల్యు.డి.హార్స్లీ పేరు మీద ఆ కొండల ప్రాంతాన్ని ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆంధ్రా ఊటీగా పేరుపొందింది.
·
తలకోన: పచ్చటి అటవీ అందాలకు ఆలవాలం తిరుమల గిరులకు ముఖద్వారం తలకోన. 270 అడుగుల ఎత్తు నుంచి దుమికే అక్కడి జలపాత సౌందర్యాన్ని చూసితీరాల్సిందే కానీ వర్ణించడానికి పదాలు చాలవు. తిరుపతి నుంచి ఇక్కడికి 40కిలోమీటర్ల దూరం.
·
కళ్యాణీ డ్యాము /కళ్యాణి ఆనకట్ట: తిరుపతి పట్టణ ప్రజల తాగునీటి అవసరమునకు ఇది సువర్ణముఖి మీద తిరుమల కొండనానుకొని కట్టబడింది. ప్రస్తుతము తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగే నీరు పట్టణానికి అందిస్తున్నారు.
·
శ్రీ శుకబ్రహ్మశ్రమమం: తిరుపతి నుండి 20 కి.మీ.ల దూరంలో ఉంది.మలయాళస్వామి ఆశ్రమం అని కూడా పిలుస్తారు.
·
నారాయణవనం: తిరుపతి నుండి 40 కి.మీ.ల దూరంలో ఉంది. ఏన్నో జలపాతాలున్నయి, ఉదాహరణ:కైలాస కోన
తిరుపతి గంగమ్మ
జాతర
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో
తిరుపతి గంగమ్మ జాతర
చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ
జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర
ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే
అపురూపమైన జాతర ఇది.
అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ.
గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి
భక్తులు వేలాదిగా తరలివస్తారు.
చరిత్ర
పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని
అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో
గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని
రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2
కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు
భక్తులు. యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను
బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను
అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి
దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు
గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసిందట. దీంతో
తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ
దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర
చేస్తున్నారు.
చాటింపు
తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రినెల చివరి మంగళవారం(ఈ ఏడాది మే 11) రోజున
చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూపస్తూపానికి అభిషేకం చేయించి, వడిబాలు
కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి
పసుపు, కుంకుమ, నూతన
వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపుకుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి
పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు వూరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ
చాటింపు వేస్తారు.
మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాణ్ని వధించేందుకు గంగమ్మ
అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో
వెుదటిరోజున బైరాగివేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ
తల్లి ఈ బైరాగివేషం వేసిందని భక్తుల నమ్మిక. రెండోరోజు బండవేషం. మానవుడు కష్టనష్టాలకు
వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు. మూడోరోజు తోటివేషం.
దీన్ని పిల్లలు ఎక్కువగా
వేస్తారు. నాలుగోరోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల
సందడి మధ్య దొరవేషదారులు వూరంతా వూరేగుతారు. స్థలపురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది.
విశ్వరూపం
నాలుగోరోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి రూపు ధరించి
పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు
సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట. దీనిని గుర్తుచేసుకుంటూ భక్తులు
ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు.
ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన
సప్పరాలను(వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే
కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాల వేషం
వేస్తారు. ఇక చివరిరోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వెయ్యికళ్లతో
ఎదురుచూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం
వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రినుంచే పడిగాపులు కాస్తారు.
పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో
బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారుచేస్తారు. భక్తులంతా
అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు
ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో
ముగుస్తుంది.
శ్రీవారి
చెల్లెలు
గంగమ్మతల్లి తిరుమల వేంకటేశుడికి
చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపుకుంకుమలూ శేషవస్త్రాలూ గంప, చేట తదితర
మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వం
తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి
వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని
దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
No comments: